Monday, January 30, 2017

చల్లపెట్టి దండకం

చల్లపెట్టి(ఫ్రిజ్) దండకం
-----------------------
భావరాజు పద్మిని – 30/1/17

ఓ చల్లపెట్టీ !నువే ఇంటమెట్టీ ! సదా ఘోషతో గట్టి సందాడి చేయంగ నేమెచ్చి ఓమూల నిన్బెట్టి నీయందె ముక్కోటి దేవుళ్ళ రూపాల గాంచూచు గొల్చూచు నీమ్రోల నమ్రాత తోడాను వంగూచు ఆనాడు గోపాల కృష్ణూని నోరందు ఏడేడు లోకాల జూచేటి యాశోదలాగాను నీనోట నాకళ్ళు జొప్పించి గాలించుచుందూను నిత్యాము నాముద్దులాపట్టి !

నేరోజు నిద్దూర లేచీన వెంటానె దేవుడ్ని చూడాక పోయీన నీమోము కన్నూల నిండూగ కాంచీన తావూనె నీలోన నుండేటి క్షీరంపు పాకెట్టు తియ్యాక నారోజు ఎట్టూల గడ్చేను చల్లాని నాతల్లి !

నీపొట్టలోనేను శాకాల ,పాకాల మెండూగ కుక్కేసి, ఆపైన పాలూను, పెర్గూను, నీరూను, చిన్నాటి బారూను, పళ్ళూను, జూసూలు ఇంకాను పచ్చళ్ళు, పిండ్లూను, చాక్లెట్లు, ఎన్నెన్నొ తిండ్లన్ని బెట్టేసి యాపైన నిన్నాటి ,మొన్నాటి ,వారాముముందాటి కూరాల, చారూల, సాంబారులాబెట్టి వాటన్నిటిన్దించు వేర్వేరు రోగాల నాయందు పోషించి వర్ధిల్లుచుంటీని గామాత!

ఒక్కొక్క తావూన నీవద్ద నిల్చోని నెందూల కొచ్చీతినోమర్చి నీముద్దు బొజ్జాను గాంచూచునుంటాను గాయమ్మ సమ్మోహనాధీశ్వరీ! శీతలాధీశ్వరీ ! సర్వ భూలోక యంత్రేశ్వరీ ! ఎల్ల జీవూల ఆకాలి దీర్చేటి చల్లాని పెట్టావతారీ ! నమస్తే నమస్తే నమస్తే నమః !
ఫలశ్రుతి : భక్తిగా ఈ దండకం రోజుకు మూడు సార్లు చదివే వారికి శీతలా మాత కృప కలిగి, వచ్చే జన్మలో మంచు కురిసే చోటిలో పుడతారట ! చదవండి(వినండి) మరి !

https://soundcloud.com/padmini-bhavaraju/challa-petti

No comments:

Post a Comment