Monday, August 29, 2016

పోతపోసిన (అ)చలజీవులు

పోతపోసిన (అ)చలజీవులు
-------------------------------
భావరాజు పద్మిని - 29/8/16

పీతలోని చైతన్యం అంతా ఆవిడలోనే ఉంది. ప్రపంచంలోని నైరాశ్యం అంతా ఆవిడ ముఖారవిందంలో గోచరిస్తోంది. బెంజ్ కార్ లో వెళ్ళేవాడు సైకిల్ తొక్కేవాడిని చూసినట్టు, ముక్కు కిందకు జారిన కళ్ళజోడును పైకి తొయ్యడానికి కూడా బద్ధకిస్తూ, దాని పైనుంచి ఆవిడ చూసిన చూపులో ఆ నిర్లక్షం చూసి, "ఎందుకు పుట్టానా?" అని వాపోని వాడు ఉండడు. అసలు ఈ ప్రభుత్వ ఆఫీసులలో పనిచేసేందుకు మనుషుల్ని ప్రత్యేకంగా ఉత్పత్తి చేస్తాడేమో దేవుడు ! ఇప్పటి వరకు నేను వెళ్ళిన/చూసిన ఏ ఆఫీస్ లోనూ, కొండంత దైన్యం తప్ప, నవ్వులు, హుషారు కబుర్లు చూస్తే ఒట్టు.

" మేడం, టైం అవుతోంది, స్పీడ్ పోస్ట్ తీసుకోరా?" అడగడం అరడజనో సారి.

"కొన్ని యుగాలు ఆ జిగురు డబ్బా పక్కనే, బలిపీఠం పై తలపెట్టుకు వేచిఉండే బందీలా, కౌంటర్ పైన తలెట్టుకు పడుండలాగ... " అన్నట్టు ఓ చూపు చూసి, "వెయిట్ కర్నా పడేగా..." అంది.

సరేనని యుగాలు క్షణాల్లా గడుపుతున్నాను. గడియారం ముళ్ళు గుండె వేగంతో పాటు కదులుతున్నాయి. ఉద్యోగినమ్మ ఏవో కాగితాల లోకంలో ఉంది. ఆవిడ తలెత్తి చూడాలని, ముక్కోటి దేవతలకి ప్రార్ధన చేసుకున్నాను. అయినా, దేవుడు కరుణించినా, ఆవిడ కరుణాకటాక్ష వీక్షణాలకి ఈ అభాగ్యురాలు నోచుకోలేదు. ఇంత టైములో పక్కన అప్పుడే వచ్చిన వెన్నారొట్టా తిని బలిష్టంగా పెరిగిన ఓ శాల్తి, జీవితచరిత్ర అడక్కుండానే రాసేయ్యచ్చేమో అనిపించింది. ఆసరికి అక్కడ డబ్బాలో ఉన్న కవర్ల మీద అడ్రస్లు అన్నీబట్టీకొట్టి అప్పజేప్పేయ్యచ్చేమో అనిపించింది. మొత్తానికి అనుకున్న తరుణం ఆసన్నమయ్యింది. అమ్మ నింపాదిగా వచ్చి, గంపంత తన హ్యాండ్ బాగ్ ను తెరిచి, మృష్టాన్న భోజనం చేసిన వాడి కడుపులా ఉన్న అందులో ఏదో కుక్కగలిగింది. అప్పుడు కన్నెత్తి నన్ను చూసింది. నాకు ఆనందంతో తీన్ మార్ డాన్స్ చెయ్యాలనిపించింది. కాని, ఇక్కడ పంజాబీ డాన్స్ మాత్రమే చేస్తారు కనుక, ఆవిడ మళ్ళీ కంగారుపడి పారిపోతే, నాకళ్ళు కాచిన కాయలు, పళ్ళయ్యి, రాలిపోయి, నేలనబడి, మళ్ళీ మొలకెత్తుతాయేమో అన్న అనుమానాస్పదం వల్ల ఆగిపోయాను.



అమ్మ నింపాదిగా, కాలికింద పొరపాటున పాకే చీమలు చస్తాయేమో చూసుకుని, మనుషుల్ని తప్ప మరే ఇతర ప్రాణులలోని జీవాన్ని హరించకూడదని, చేసుకున్న తీర్మానాన్ని గుర్తుచేసుకుంటూ, వచ్చి, ఆసనమును అలంకరించి, కీ బోర్డు లాగింది. ఇంతలో ఓ అనుకోని మరో ఉపద్రవం. ఆవిడ మొబైల్ మ్రోగింది. హతోస్మి. అవతల ఆవిడ ఈవిడతో బాటు, ఈవిడ వీధి వీధందరి బాగోగులు అడుగుతోంది. ఈవిడ ఓ పది నిముషాలు మాట్లాడాకా, " అన్నట్టు, ఆంటీ, మీరు ఈ నెల పోస్టాఫీసు డిపాజిట్ కట్టారా?" అనడిగింది. "ఏమో, గుర్తులేదు," అంది అవతలి ఆంటమ్మ. ఇంతలో హీరొయిన్ పూజల ఉధృతికి బెదిరి, విఠాలాచార్య సినిమాల్లో హఠాత్తుగా పునర్జీవం పోసుకున్న నాయకుడిలా, పక్క కౌంటర్లో ఉన్న సాలభంజిక చైతన్యాన్ని సంతరించుకుని, "ఇంకా కట్టలేదు గీతా మేం..." అంది. నేను ఉలిక్కిపడి, వెన్ను తట్టుకుని, ఈ తమాషా అంతా చూస్తుండగా, సుమారు అరగంట లోపే ఆ ఊకుమ్మడి పలకరింపులు ముగిసాయి. ఈ లోపు నా దౌర్భాగ్యం వల్ల నాపక్కన ఇంకో శాల్తీ వచ్చి నిల్చున్నాడు.

"ఏంటి, ఇవాళ ఒక్క కవరేనా? ఎందుకు నా మీద ఇంత దయ చూపించావు? అన్నట్టు, నువ్వు పోస్టాఫీసు స్కీం లో చేరతానన్నావు? గుర్తుందా ?" అంటూ మొదలెట్టి, ఉన్న స్కీం లు, వాటి వడ్డీలు, చివరికి ముట్టే అసలు అన్నీ (తన కొచ్చే వాటా తప్ప) చెప్పసాగింది. అప్పుడే నా అజ్ఞానం తొలగిపోయి, ఆవిడ బాగ్ అంత లావుగా ఎందుకుందో జ్ఞానోదయం అయ్యింది. నేను దీనాతిదీనంగా... "మేడం..." అంటే...

"ఉ, ఊ, చేస్తున్నాగా... సహనం ఉండాలి. ఓర్పు ఉండాలి, లేకపోతే మీరు జీవితంలో ఏమీ సాధించలేరు," అంది. ఇక "చస్తే పోస్టాఫీసుకు వెళ్ళను, " అని ఐదొందలోసారి తీర్మానించుకుని, ఓ గంటా పదిహేను నిముషాల ఇరవై తొమ్మిది సెకన్లకు ఇంటికొచ్చి, " బుద్ధి, బుద్ధి" అనుకుంటూ, నాచెంపలు, మా అమ్మాయి ఆడుకునే బార్బీ బొమ్మల చెంపలూ అన్నీ వాయించాను. హే విశ్వచైతన్య పితా ! జడానికి, జీవానికి మధ్యస్తంగా సృష్టించిన ఈ ప్రాణుల్లో కాస్త చైతన్యం నింపవూ, ప్లీజ్..."

No comments:

Post a Comment