Wednesday, August 3, 2016

//రసాయనిక వంట//

//రసాయనిక వంట//
--------------------------
భావరాజు పద్మిని - 3/8/16

రసాయన శాస్త్రం చదివిన నాలాంటి వనిత అదే భాషలో వంటలు చెబితే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది.

పరిచయం:
భౌతిక చర్యలు పరివర్తనీయమైనవని మనకు తెలిసిందే. కాని, రసాయనిక చర్యలు అలాక్కాదు. వంట అనేది అపరివర్తనీయ(irreversible) రసాయనిక చర్య. ఇందులో రెండు లేక అంతకంటే ఎక్కువ సమ్మేళనాలు కలిసి చర్య జరిపి, ఉత్పన్నాలను ఇస్తాయి. వాటినే మనం తింటాము. ఆపై మనలో ఏమేమి ఉత్పత్తి అవుతాయో, వంటల్లో మీరు వాడే పదార్ధాల నిష్పత్తిని బట్టి ఉంటుంది. అన్నట్టు, ఈ రసాయనిక వంట చర్య వేగంగా జరిగేందుకు మనము ఉత్ప్రేరకాలను(catalyst) కూడా వాడవచ్చు. ఇక వంట చర్య వద్దకు వచ్చేస్తే...

లక్ష్యం :
కాకరకాయ హల్వా తయారుచేయుట
కావలసిన పదార్ధాలు:
పరీక్షనాళిక కాదు - పరీక్ష మూకుడు, సోడియం క్లోరైడ్ (దీనినే తెలుగులో ఉప్పు అందురు), మెగ్నీషియం సల్ఫేట్ (ఎప్సం సాల్ట్ - కడుపుకు ఉత్ప్రేరకం, విరేచానకారి), ముడి కాకరకాయలు(ముడి ఇనుము లాగా), పొడి చేసిన సుక్రోస్ కి రూపాంతరము (బెల్లానికి వచ్చిన తిప్పలు), ఆనిమల్ఫాట్ (నెయ్యి ) ఇత్యాదులు...

విధానము:
ముందుగా హెచ్.టు.ఓ తో ముడి కాకరకాయలను బహిర్గత చర్య జరిపించవలెను(కడగాలి అన్నమాట). అటుపై వానిని గ్రేటింగ్ చేసి, కొద్దిగా సోడియం క్లోరైడ్ కలిపి, సెంట్రీఫ్యూజ్ చెయ్యవలెను, ఆ పై ఫిల్టరేషన్ ప్రక్రియ ద్వారా ద్రావకాన్ని విడగోట్టవలెను. (తరిగి, మిక్సీ వేసి, పిండి పెట్టుకొనుటకు వచ్చిన...). అటుపై సుక్రోస్ రూపాంతర పొడి, ఎప్సం సాల్ట్ కలిపి పెట్టుకోవలెను. పరీక్ష మూకుడులో కాస్త ఆనిమల్ఫాట్ వేసి, బర్నెర్ పై హీట్ చెయ్యవలెను. అటుపై కాకరకాయ మిశ్రమాన్ని కలిపి, 15 -20 నిముషాలు ఉంచి, జరుగునవి గుడ్లప్పగించి గమనించవలెను.



పరిశీలనలు:
ముందుగా పరీక్ష మూకుడు వేడెక్కుతున్నను, అందు ఉష్ణోగ్రత పెరుగుదల ఉండదని, మేము ధర్మామీటర్ అందు పెట్టుట ద్వారా గమనించితిమి. ఇందుకు కారణము గుప్తబాష్పీకరణ శక్తి(latent heat of vaporization) . కాకరకాయ పరమాణువుల్లో ఉన్న అంతరపరమాణు బంధాలను అధిగమించే గతిశక్తి (kinetic energy) వాటికి వచ్చాకా, మనం ధర్మామీటర్ లో ఉష్ణోగ్రత పెరుగుదలను గమనించవచ్చు. అటుపై చర్య ముగిసే సరికి, ఆకుపచ్చరంగు సమ్మేళనాలు నల్లరంగు ఉత్పత్తులుగా మారుట చర్య ముగిసినది అని చెప్పుటకు చిహ్నము.

నిర్ధారణలు:
"మీ ఇంటి రసాయన వంట" కార్యక్రమంలో ఉత్పన్నాన్ని తిన్న ఆంకరమ్మ "ఇచ్చోటనే కదా !" అన్న పజ్జం పాడుకుంటూ వెళ్ళిపోయింది. ఎప్సం సాల్ట్ మహిమ ఏమగునో ఆమె మరుసటి దినము చెప్పిన తదుపరే నిర్ధారించగలము. అంచేత ఎవరి కాల్షియమ్, ఫోస్ఫోరస్, సోడియం మిశ్రమ సిరి వారిదని అందురు. ఇదియేమి అని ఆశ్చర్యపోవుచుంటిరా? ఇదియును తెలియదు, తమ సెల్ ఫోన్ లో సిమ్ము. దీనినే తెలుగులో 'దంత సిరి' అందురు.

గమనిక:
నిపుణుల పర్యవేక్షణ లేకుండా ఈ ఉత్పన్నమును ఎవరైనా గృహము నందు తయారుచేయుటకు ప్రయత్నించిన ఆపై మరుసటి దినము ఉదయమున జరుగు విపరీతములకు ప్రయోగము తెలిపిన వారు బాధ్యత వహించరు. అంచేత ముందుగా నన్ను నామినీ గా పెట్టి, భారీ మొత్తంలో ఎల్.ఐ.సి పాలసీ తీసుకుని, ఈ నూతన ఆవిష్కరణను ప్రయత్నించవలెను. ఇది చదవగా వికటించిన భావనల వలన ఇంత గొప్ప ఆవిష్కరణకు నాకు నోబెల్ బహుమతి ఇవ్వవలెనని మీకు ముచ్చట కలిగిన, కలుగవచ్చు. మొహమాటపడకుడు, ఆస్కార్ కు సైతము సిఫార్సు చేయుడు. ప్రయోగము కంచికి, మనము భవసాగారాలకి...


No comments:

Post a Comment