Sunday, July 26, 2015

మౌనాన్ని తిందాం రా !

 మౌనాన్ని తిందాం రా !
-------------------------
- భావరాజు పద్మిని 
ఎన్నాళ్ళని ఈ పులిహోరలు, పాకుండలు తింటాం ?
ఎన్నేళ్ళని ఈ పిజ్జాలు, పాప్కార్న్ లు తింటాం ?
ఎన్ని రోజులని ఫేస్బుక్ లో, వాట్స్ ఆప్ లో చాటుతాం?
ఎన్ని డబ్బులని మొబైల్ బిల్లుకు కడతాం, నువ్వే చెప్పు?

అందుకే ప్రియా...
ఇద్దరం కాస్త మౌనాన్ని తిందాం రా !
గుటుక్కున నిశ్శబ్దాన్ని మింగుదాం రా !
పుటుక్కున శూన్యాన్ని తాగుదాం రా !
లటుక్కున దైన్యాన్ని తరుముదాం రా !
ఘబుక్కున దూరాన్ని పిండి ఆరేద్దాం రా !
రిన్ సబ్బుతో ప్రేమనుతికి తెల్లగా మెరిపిద్దాం రా!

కూలింగ్ గ్లాస్సెస్ తో కళ్ళు నెత్తికెక్కి,
డబ్బుతో జబ్బుచేసిన ఈ పాడులోకంలో 
స్వచ్ భారత్ లా స్వచ్చమైనవి ఇవే ప్రియా...
చీపురుతో గుండె గూటిని ఊడుద్దాం రా !
చాటతో ప్రేమ తాట తీసి, ఎత్తేద్దాం రా !



Monday, July 13, 2015

భీభత్స కవిత


అదేవిటోనమ్మా... ఇవాళ కవితలు తన్నుకోచ్చేస్తున్నాయి.... మరొక నవజాత కవిత....
భీభత్స కవిత 
- భావరాజు పద్మిని, సెప్టెంబర్ 6,2013 

అర్ధరాత్రి... అమావాస్య....

కరకింకర స్మశానంలో 
కరకరా జంతికలు తింటూ,
రాంగోపాల్ వర్మ సినిమా చూస్తున్నాడు.

ఉన్నట్టుండి ఉలిక్కిపడ్డాడు 
బిక్కచచ్చిపోయాడు...
పిల్లదేయ్యం వీపు తట్టింది.

అంతే ,
సుడిగాలిగా గాల్లో తేలుతూ 
రాంగోపాల్ వర్మ ఇంటికి వెళ్ళాడు.
వికటాట్టహాసం చేసాడు.
లెంపకాయ్ కొట్టి,


దెయ్యాలు కూడా బెదిరి చచ్చేట్టు 
ఏవిటా దిక్కుమాలిన సినిమాలు...
నీ పిండం పిల్లదేయ్యలకు పెట్టా!
అంటూ బిగ్గరగా ఆర్తనాదం చేసాడు.

ఒక్కసారి కరకింకరను తేరిపారా చూసి,
ఆవులించిన అభినవ భీబత్స దర్శకుడు,
ఎల్లెల్లవో, సినిమాల్లో చాలా చూపించాం 
నీ లాంటి ఆకారాల్ని, అంటూ...
ఆవులించి, మళ్ళీ నిద్రపోయాడు.

టీవీ చూసి వండండి

'ఏవండి, ఇవాళ టీవీ లో ఈ కొత్త వంటకం చూపించారు. కష్టపడి చేసాను ,రుచి చూసి, చెప్పరూ.'

'ఓ ఏదీ ఇటివ్వు. ఆహా, చిన్నప్పుడు తిన్న సబ్బు ముక్కను గుర్తుకు తెచ్చావు, ఇంతకీ ఈ పదార్ధం ఏవిటి తల్లి ?'

'ఉ తీ కా హల్వా ' అండీ. అంటే, ఈ హల్వా లో ఉప్పు, కారానికి పచ్చి మిరపకాయలు, తీపికి బెల్లం,వెయ్యాలన్నమాట. మొదటి అక్షరాలు కలిపి ఆవిడే ఆ పేరు పెట్టిందట. '

'అలాగా, యెంత సృజనో, పిచ్చి తల్లికి. ఇంతకీ ఈ వంటకం వండాకా ఆ వండిన శాల్తీ తిందా?'

'లేదండి, ఆంకరమ్మ తిని యెగిరి గంతేసింది.'

'వెంటనే వెనక్కి తిరిగి ఉమ్మేసి ఉంటుంది. నీ లాంటి గొర్రెలు ఆ ఆంకరమ్మ హావభావాలు చూసి, వెంటనే కొత్త వంటలు వండేసి ,ఇలా మంగళ సూత్రాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇదిగో, ఈ సారికి ఎలాగో నియంత్రించుకున్నాను గాని, ఇంకోసారి ఇలాంటి వంటకాలు చేసావంటే, ఇద్దరం ఎర్రగడ్డలో చేరాలి. నేను పేషెంట్ గా, నువ్వు నాకు ఆయాగా.'


వంట చెయ్యడం ఎలా ?


వంట చెయ్యడం ఎలా ?
=============
- భావరాజు పద్మిని, april 24,2013
చదువు అయ్యాకా, కాంపస్ సెలెక్షన్ లో ఉద్యోగం రావడం, తరువాత వెంటనే ప్రవాసీయుడితో పెళ్లి కుదిరిపోవడంతో, విదేశాలకు వెళ్ళిపోయింది స్వీటీ. స్వీటీ కి స్వీట్లు రావు...చాలా సమయం ట్విట్టర్ లో ట్వీట్లకే సరిపోయింది. ఆ పై పేస్ బుక్ లో, మొబైల్ లో చాట్లకు సరిపోయింది. ఇక స్వీట్లు, హాట్లు చెయ్యడం అసలే రాదు...ఆ మాటకొస్తే అసలు వంటే రాదు...దానితో సాపాటు కోసం పాట్లు మొదలయ్యాయి.

విదేశాల్లో భారతీయ ఆహారం దొరుకుతుంది. కాని ఖరీదు చాలా ఎక్కువ. రోజూ తింటే, డాలర్లు కరిగిపోతాయి...మరెలా? 'గూగుల్ మాతా శరణం ...' అనుకుంది...కేవలం గూగుల్ కే న్యాయం చేస్తే ఎలా? ఒక్కో వంటా ఒక్కొక్క విధంగా చెయ్యాలి ...ఈ స్వీటీకి సాటి లేదని అనిపించాలి. ఏం చేద్దాం...గూగుల్ లో గుత్తి వంకాయ కూర, ట్విట్టర్ లో టమాటో పప్పు, పేస్ బుక్ చాట్లో పులుసు వెతికి, అడిగి, తెలుసుకుని చెయ్యాలి...అనుకుంది.

తక్షణమే ఒక్క బండ వంకాయ రెండు డాలర్లు, నాలుగు గజ టమాటోలు నాలుగు డాలర్లు, ఉల్లిపాయలు, మిర్చి, ములక్కాడలు వెరసి ఇరవై డాలర్లు పెట్టి కూరలు తెచ్చింది. వెంటనే ఎలా వండాలో ప్రశ్నల వర్షం కురిపించింది.


గుత్తి వంకాయకి, ఖారం నూరి, కూరి, నూనెలో వెయ్యాలని చదివింది. ఆ గజవంకాయ చీల్చి, కారం కూరి నూనెలో వేసింది. క్షణాల్లో మూకుడు నిండా ముంతడు నీళ్ళు తేలాయి..'.షిట్...ఈ వంకాయ చిన్నప్పుడు ఎక్కువ నీళ్ళు తాగేసి ఉంటుంది. ', అనుకుంది. గూగుల్ లో చెప్పినట్టు పది నిముషాలకు స్టవ్ ఆఫ్ చేసింది.

ట్విట్టర్ లో ట్వింకిల్ టొమాటోలు, కందిపప్పు కలిపి నీళ్ళు పోసి, కుక్కర్ లో పది నిముషాలు పెట్టమంది. 'ఆ వంకాయ నీళ్ళు తగేసినట్టు, కందిపప్పు,టొమాటోలు కూడా తాగేసి ఉంటాయి.అందుకే, నీళ్ళు అక్కర్లా!,' అనుకుని, కుక్కర్ లో నీళ్ళు పొయ్యకుండా పెట్టి, తర్వాత ఆపేసింది.

ఇక పులుసులో ములక్కాడలు, ఉల్లిపాయలు, ఇలా చెప్పినవన్నీ కలిపి స్టవ్ మీద పెట్టి, రైస్ కుక్కర్ లో బియ్యం పెట్టసాగింది. పని అలవాటు లేకపోవడంతో, యూసర్ మన్యుఅల్ చదువుతూ , చాలా సమయం తీసుకుంది. ఈ లోపు పులుసు ఇగిరి, గిన్నె మాడువాసన వచ్చింది. పోనీలే, పప్పు, కూరా ఉందిగా, ఇవాళ హబ్బి కి సర్ప్రైస్ ...అని, సరిపెట్టుకుంది.

తీరా చూస్తే, నీళ్ళు తగ్గడంతో, పప్పు ఉడకలా, వంకాయ ఉడక్క, కండ్ర పట్టి చేదు వచ్చింది. అలసటతో , నిస్సత్తువతో, బిక్క మొహం వేసిన స్వీటీ ని చూసి, జాలేసిన హబ్బి, ఆమెను వోదారుస్తూ...బాధపడకు, వంట చెయ్యగా, చెయ్యగా వస్తుంది. మనుఅల్స్ చదివితే రాదు...కోటి విద్యలూ కూటి కొరకే అన్నది మర్చిపోయి, కెరీర్ కోసం పరుగులు పెడుతూ, చివరికి నీలా, నాలా దేశాలు పట్టుకు తిరుగుతూ, తిప్పలు పడేది ఎందరో...

నీకో సర్ప్రైస్ ...ఇదిగో మహత్తరమయిన ప్రియా ఆవకాయ, గోంగూర, ఇవాళే స్టోర్ లో కొన్నా...ఇదీ, యోగర్ట్...ఇంతకంటే, మన తెలుగు వాళ్లకు ఏం కావాలి చెప్పు, స్మైల్ స్వీటీ...'అన్నాడు. హమ్మయ్య, అనుకుని నిట్టూర్చి, స్వీట్ గా నవ్వేసింది స్వీటీ...

[ ఒక ఆప్తురాలి కోరికపై ఈ సరదా వ్యాసం...ఆమెకే అంకితం]