Tuesday, January 13, 2015

పది నిముషాల్లో పంజాబీ డాన్స్

                                                             పది నిముషాల్లో పంజాబీ డాన్స్ 
                                                            -----------------------------------
                                                                                                                        భావరాజు పద్మిని - 13/1/15

"మా పాపకి పంజాబీ డాన్స్ నేర్పిస్తానండి..."
"ఓహో, ఎక్కడ చెప్తారు ?"
"ఎదురుగుండా రమణ్ అండ్ రాహుల్ అకాడమీ ఉందిగా, అక్కడ... "
 ఆ అకాడమీ కి ఒకసారి మా పాప పోరు పడలేక వెళ్తే, కల్లు తాగిన కోతిలా కుర్చీలో కూర్చున్న ఒక శాల్తి, ఎర్రటి కళ్ళతో తగిలింది. అది గుర్తొచ్చినా, తెలీనట్టు మొహం పెట్టి...
"బాగుందండి...ఆ అకాడమీ లో పిల్లలకి వారానికి 2,3 ప్రోగ్రాం లు అయినా ఉంటాయట, పోన్లెండి, మీ పాపకి స్టేజి ఫియర్ పోతుంది... మీకు పిల్లలతో తిరిగీ తిరిగీ ఓర్పు  నశించిపోతుంది.... " అని జారుకున్నాను.
వెంటనే నా బుద్ధి చెట్టేక్కేసింది... నేనే ఒక డాన్స్ అకాడమీ పెట్టేస్తే...
ఇక్కడ పంజాబీ డాన్సులే నేర్పుతారు కనక 'పది నిముషాల్లో పంజాబీ డాన్స్ ' అని పేరు పెడితే అద్భుతంగా ఉంటుంది కదా !
ఇల్లల్లగ్గానే, పండగా పద్మినమ్మా... ఏం నేర్పుతావ్ అంటారా ? అయితే ,ఆశువుగా పది పంజాబీ స్టెప్పులు చెప్తా కాస్కోండి, వినేందుకు... 




1. ముందుగా రెండు కర్చీఫ్ లు సిద్ధం చేసుకోవాలి. అవి చెరో చేత్తో పట్టుకుని, ఎవరో తరుముతున్నట్టు పరిగెట్టాలి.
2. ఉన్నట్టుండి పరుగు ఆపేసి, యెగిరి గంతేసి, హడిప్పా అనాలి.
3. ఇప్పుడు క్రికెట్ అంపైర్ బాట్స్మన్ 'అవుట్ ' అయితే చూపుడు వేలు పైకి చూపినట్టు రెండు చేతులూ ఎత్తి క్రిందికి, పైకి ఆడించాలి. అలా చేస్తూ, కాలికి పేడ అంటితే, చెప్పు  నేలకేసి, రాసినట్టు.. భావిస్తూ, కాళ్ళు కదిలించాలి.
4. ఇప్పుడు ఆకాశంలో బావి ఉన్నట్టు భావించి, అదృశ్య చేదతో, నీళ్ళు తోడాలి.
5. ఇప్పుడు కాలు బెణికితే, జాడించి విదిలించినట్టు, కాలు అటూ ఇటూ కొట్టాలి.
6. తర్వాత, ఎవరూ లేరు అని చేతి సైగతో చెప్పినట్టు, రెండు చేతులూ తిప్పాలి.
7. వెనక నుంచి, ఎవరో మిమ్మల్ని లాగుతున్న్నట్టు, ముందుకీ, వెనక్కి గింజుకోవాలి.
8. నేల మీద ఏదో జారిపోతే వెతుకుతున్నట్టు, క్రింద కూర్చుని, డేకాలి. తర్వాత అక్కడే కూర్చుని, బొంగరంలా గింగిరాలు తిరగాలి.
9. ఇప్పుడు లేచి, కిక్కిరిసిన బస్సు లో పైన రాడ్ పట్టుకుని, పక్కన అడ్డొచ్చిన వాళ్ళని, మోచేత్తో పొడుస్తున్నట్టు చేతులు ఆడించాలి.
10. మధ్య మధ్య నిప్పులు తొక్కిన కోతిలా ఎగరాలి.  అలా ఎగురుతూ, ఎదుటి వాళ్ళ మొహం మీద పౌడర్ ఎక్కువైతే తుడిచినట్టు, కర్చీఫ్ విదిలించాలి.

ఇంకా... ఆశ... (దోశ ఇక్కడ దొరకదు), నేను అన్నీ ఫ్రీ గా చెప్పేస్తాను అనుకున్నారా ? ఇంకా కావాలంటే, జస్ట్ పదివేలు కట్టి మా డాన్స్ తిక్కాడమీ లో చేరుడీ ! అరనిముషంలో అరవై అవిడియా లు పొందండి...